రూపాయిని 68-70కి తెస్తాం


అనవసర దిగుమతులు అరికడతాం
ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌
దిల్లీ: రూపాయిని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నం చేస్తోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువను 68-70 స్థాయికి తీసుకొచ్చేందుకు రెండో విడత చర్యలకు దిగబోతున్నట్లు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ తెలిపారు. రూపాయి బలోపేతం కోసం ఇప్పటికే తయారీ సంస్థలు విదేశాల్లో రుణాలు తీసుకునే నిబంధనలను సడలించడం, కార్పొరేట్‌ బాండ్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల (ఎఫ్‌పీఐ)కు అవరోధాల తొలగింపు, మసాలా బాండ్లకు పన్ను రాయితీల వంటి ప్రోత్సాహకాలను ప్రకటించిన సంగతి విదితమే. ‘ఈ ఏడాది ఇప్పటివరకు రూపాయి విలువ దాదాపు 12 శాతం తగ్గింది. ఇది తాత్కాలికమే. ఎక్కువగా దిగుమతులపై ఆధారపడే మన దేశానికి డాలర్ల అవసరం ఎంతైనా ఉంది. వాటికి గిరాకీ పెరగడంతోనే రూపాయి మారకపు విలువ బలహీనపడుతోంది. అందుకే అత్యవసరం కాని వస్తువుల దిగుమతులపై త్వరలోనే ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నాం. ఎగుమతులను  ప్రోత్సహిస్తాం. దీంతో రూపాయి మారకపు విలువను 68-70 స్థాయికి తీసుకొస్తామ’ని గార్గ్‌ వివరించారు. ఇదిలా ఉంటే ఇటీవల ప్రధాని మోదీ రూపాయి బలోపేతానికి తీసుకోవల్సిన చర్యలపై సమావేశం నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ నిర్ణయాలు రూపాయి పతనాన్ని అంతగా అడ్డుకున్నట్లు కనిపించలేదు. అందుకే రెండో విడత ఉపశమన చర్యలకు ప్రభుత్వం దిగుతున్నట్లు కనిపిస్తోంది. దిగుమతులు తగ్గించుకోవడంతో పాటు కొన్ని వస్తువుల ఎగుమతుల్ని పెంచుకొనేందుకు విధానాలు రూపొందించబోతున్నట్లు గార్గ్‌ వెల్లడించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి 68-70 స్థాయిలో ఉండటం సహేతుకమని, 72 అనేది అనుమతించదగిన కనిష్ఠస్థాయి అని వివరించారు. అయితే గత శుక్రవారం డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 72.20 వద్ద ముగిసింది. ఇదే నెల ప్రారంభంలో 72.91 జీవనకాల కనిష్ఠ స్థాయిని కూడా నమోదు చేసిన సంగతి తెలిసిందే. రూపాయి పతనంతో కరెంటు ఖాతా లోటు (సీఏడీ) పెరుగుతోంది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో సీఏడీ, జీడీపీలో 2.4 శాతానికి చేరింది. చమురు దిగుమతి బిల్లు బాగా పెరుగుతుండటంతోనే వాణిజ్య లోటు, సీఏడీ పెరుగుతున్నాయని గార్గ్‌ తెలిపారు.
సెప్టెంబరులో ఎఫ్‌పీఐల విక్రయాలు రూ.15,000 కోట్లు
దేశీయ క్యాపిటల్‌ మార్కెట్లలో ఎఫ్‌పీఐలు ఈ నెలలో నికర విక్రయదార్లుగా మిగిలారు. ఇప్పటికే 2.1 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.15,365 కోట్లు) అమ్మకాలు చేపట్టారు. గత రెండు నెలల్లో వీరు దేశీయంగా పెట్టుబడులు పెట్టగా, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, దేశ కరెంటు ఖాతా లోటు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ నెలలో అమ్మకాలకు దిగారు. ఎఫ్‌పీఐలు ఏప్రిల్‌-జూన్‌లో రూ.61,000 కోట్ల మేర పెట్టుబడులు ఉపసంహరించగా, జులైలో రూ.2,300 కోట్లు, ఆగస్టులో రూ.5,200 కోట్లు పెట్టుబడి పెట్టారు. మళ్లీ ఈ నెలలో ఈనెల 21 వరకు ఈక్విటీల నుంచి రూ.6,832 కోట్లు, డెట్‌ మార్కెట్ల నుంచి రూ.8,533 కోట్లు (మొత్తం రూ.15,365 కోట్లు) ఉపసంహరించారు.

Post a Comment

0 Comments