నేడే అఫ్గాన్‌తో భారత్‌ ఢీ
ఆసియాకప్‌ సూపర్‌-4 పోరు
సాయంత్రం 5 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
దుబాయ్‌
సూపర్‌-4 తొలి మ్యాచ్‌లో బంగ్లాను ఓడించి... రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసి.. ఆసియాకప్‌లో జోరు మీదున్న టీమ్‌ఇండియా మరో పోరాటానికి సిద్ధమైంది. మంగళవారమే అఫ్గానిస్థాన్‌తో పోరు. బలాబలాలు.. ఫామ్‌.. ర్యాంకింగ్‌ ఏది పరిగణనలోకి తీసుకున్నా భారత్‌ ముందు అఫ్గాన్‌ దిగదుడుపే! కానీ ఈ టోర్నీలో అనూహ్య ప్రదర్శన చేస్తున్న పఠాన్‌ల బృందం ఊపు మీదున్న భారత్‌కు ఎలాంటి పోటీ ఇస్తుందనేది ఆసక్తికరం.
సియాకప్‌లో మరో ఆసక్తికర పోరు. ఇప్పటికే దాదాపు ఫైనల్‌ బెర్తు ఖరారు చేసుకున్న భారత్‌.. టోర్నీ నుంచి నిష్క్రమించిన అఫ్గాన్‌ జట్లు సూపర్‌-4 ఆఖరి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియానే ఫేవరెట్‌ అయినా.. సూపర్‌-4 తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆఖరి వరకు పోరాడిన అఫ్గానిస్థాన్‌ను తక్కువ అంచనా వేస్తే చేదు అనుభవం తప్పదు. మరోవైపు బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌లపై ఘన విజయాలు సాధించిన భారత్‌.. హ్యాట్రిక్‌ గెలుపుపై కన్నేసింది. అయితే ఈ టోర్నీలో ఇప్పటిదాకా మిడిలార్డర్‌కు ఎలాంటి సవాల్‌ ఎదురు కాలేదు. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో మిడిలార్డర్‌ రాణించాలని కెప్టెన్‌ రోహిత్‌శర్మ కోరుకుంటున్నాడు. రషీద్‌ఖాన్‌ లాంటి నాణ్యమైన స్పిన్నర్‌ను ఎదుర్కొని మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ నిలవాలనేది అతని కోరిక. విరాట్‌ కోహ్లి లేని నేపథ్యంలో ధావన్‌ (327), రోహిత్‌ (269) మాత్రమే ఇప్పటిదాకా బ్యాటింగ్‌ భారాన్ని పంచుకున్నారు. మూడో స్థానంలో వస్తున్న అంబటి రాయుడు (116) ఫర్వాలేదనిపించాడు. అయితే కేదార్‌ జాదవ్‌, ధోని, దినేశ్‌ కార్తీక్‌లకు ఇప్పటిదాకా బ్యాటింగ్‌ అవకాశాలు తక్కువగా వచ్చాయి. ఇప్పటిదాకా కేదార్‌ 27 బంతులే ఎదుర్కోగా.. ధోని 40 బంతులే ఆడాడు. మునుపటిలా వేగంగా ఆడలేకపోతున్న మహి.. అఫ్గాన్‌పైనైనా జూలు విదుల్చుతాడేమో చూడాలి. ఈ టోర్నీలో ఇప్పటిదాకా అవకాశం దక్కని కేఎల్‌ రాహుల్‌, మనీష్‌ పాండేలకు కూడా ఈ మ్యాచ్‌లో చోటు కల్పించే అవకాశాలున్నాయి. ధావన్‌ స్థానంలో రాహుల్‌.. రాయుడు స్థానంలో పాండే జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి.
వాళ్లకు తిరుగేలేదు: బౌలింగ్‌లో భారత్‌కు తిరుగేలేదని చెప్పాలి. పేసర్లు బుమ్రా      (7 వికెట్లు), భువనేశ్వర్‌ కుమార్‌ (6 వికెట్లు)లతో పాటు స్పిన్నర్లు చాహల్‌ (5 వికెట్లు), కుల్‌దీప్‌ యాదవ్‌ (5 వికెట్లు) అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా బుమ్రా, భువి.. ఆరంభ, స్లాగ్‌ ఓవర్లలో అదరగొడుతున్నారు. పాక్‌తో మ్యాచ్‌లో వీళ్లిద్దరి బౌలింగే ఇందుకు ఉదాహరణ. ఫైనల్‌ను దృష్టిలో ఉంచుకుని వీరికి విశ్రాంతినిచ్చి రిజర్వ్‌ బెంచ్‌ మీదున్న దీపక్‌ చాహర్‌, సిద్ధార్థ్‌ కౌల్‌లకు చివరి మ్యాచ్‌లో ఆడించే అవకాశాలు లేకపోలేదు. అరంగేట్రంలో ఆకట్టుకున్న ఖలీల్‌ అహ్మద్‌ కూడా అఫ్గాన్‌తో మ్యాచ్‌ ఆడే అవకాశాలున్నాయి. మరోవైపు భారత్‌కు షాకిచ్చి ఈ టోర్నీని గొప్పగా ముగించాలని అఫ్గాన్‌ పట్టుదలతో ఉంది. గ్రూప్‌ దశలో శ్రీలంక, బంగ్లాపై గెలిచిన ఆ జట్టు.. సూపర్‌-4లో కొద్దిలో విజయాలు చేజార్చుకుంది.
ఫిక్సింగ్‌ చేస్తావా! 
అఫ్గానిస్థాన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ షెజాద్‌ను స్పాట్‌ ఫిక్సింగ్‌ ఉచ్చులో దించేందుకు బుకీలు ప్రయత్నించిన విషయం వెల్లడైంది. ప్రస్తుత ఆసియా కప్‌ సందర్భంగానే అతడితో ఈ సంప్రదింపులు జరిగినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఐతే షెజాద్‌ను ఫిక్సింగ్‌కు పాల్పడాల్సిందిగా కోరింది ఆసియా కప్‌ మ్యాచ్‌ల్లో కాదట. వచ్చే నెల  జరగబోయే అఫ్గాన్‌ ప్రిమియర్‌ లీగ్‌ టీ20లో తక్కువ స్కోరు చేస్తే డబ్బులిస్తామని ఫిక్సర్లు చెప్పారట. షెజాద్‌ ప్రలోభాలకు లొంగకుండా నేరుగా ఐసీసీ నిరోధక విభాగానికి విషయం చేరేలా చూశాడు.
4
వన్డేల్లో 100 వికెట్లు తీయడానికి భువనేశ్వర్‌కు కావాల్సిన వికెట్లు
95
వన్డేల్లో 10 వేల మైలురాయి అందుకోవడానికి ఎం.ఎస్‌.ధోనికి అవసరమైన పరుగులు.