పుణె
ఫుట్‌బాల్‌లో మాదిరి క్రికెట్లో కోచ్‌లు జట్లపై ఆధిపత్యం చలాయించాలనుకుంటే కుదరదని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ అన్నాడు. ‘‘క్రికెట్‌ ఫుట్‌బాల్‌ లాగాకాదు. ప్రస్తుతం క్రికెట్లో చాలామంది కోచ్‌లు తమ జట్లను ఫుట్‌బాల్‌ టీంల తరహాలో నడిపించాలని చూస్తున్నారు. కానీ క్రికెట్‌ కెప్టెన్‌ ఆట. కోచ్‌లు వెనుక సీట్లో ఉండాలి. అది చాలా కీలకమైన విషయం’’ అని అతను చెప్పాడు. పుణెలో తన ఆత్మకథ ‘ఎ సెంచరీ ఈజ్‌ నాట్‌ ఎనఫ్‌’ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. జట్టులో ఒక్కొక్కరిపై దృష్టి పెట్టి వారిని సరైన దారిలో నడిపించడం క్రికెట్‌ కోచ్‌ అతి పెద్ద బాధ్యత అని, ఐతే ఈ లక్షణం ఇప్పటి కోచ్‌ల్లో చాలా తక్కువమందికే ఉందని సౌరభ్‌ అన్నాడు. ప్రస్తుత టీమ్‌ఇండియా కోచ్‌ రవిశాస్త్రిని ఓ ప్రశ్న వేయాల్సి వస్తే ఏం అడుగుతారని అడిగితే.. ‘‘ప్రస్తుతం తుది జట్టును ఎవరు ఎంపిక చేస్తున్నారు.. రోహిత్‌ శర్మా? రవిశాస్త్రా’’ అని గంగూలీ బదులిచ్చాడు.