ఉద్యోగాలు చేసే అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. దాంతో పార్టీలు, వేడుకల్లోనే కాదు ఆఫీస్‌కి వెళ్లేప్పుడూ అంతే అందంగా, ట్రెండీగా కనిపించాలనుకుంటున్నారు. వాటితో పాటు  హుందాగానూ కనిపించాలనేది వారి ప్రాథమిక నియమం. అందుకే ఆఫీసుకి వెెళ్లేటప్పుడు చీరను కట్టుకుని ఎలా ఆకట్టుకోవచ్చో చెబుతున్నారు డిజైనర్‌  నిహారికారెడ్డి.
హ్యాండ్‌బ్యాగు: 
చీరలో ఆఫీసుకి వెళ్తున్నప్పుడు వెంట తీసుకెళ్లే హ్యాండ్‌బ్యాగు ఎంపికలో జాగ్రత్త తీసుకోవాలి. మీ ఎత్తు, శరీరాకృతిని బట్టి దాన్ని ఎంచుకోవాలి. అలానే  రోజువారీ అవసరాలకు సరిపడా వస్తువులన్నీ పట్టేంత పరిమాణంలో ఉండి, నాణ్యమైన రకంలో చూసి కొనుక్కోవాలి. అలా చీరలకు జతగా వేసుకోగలిగే హ్యాండ్‌బ్యాగు రకాల్లో సాచెల్‌, టోటె రకాలు బాగుంటాయి. 
చెప్పులు: 
చీరలు కట్టుకున్నప్పుడు ఎలాంటి చెప్పులు వేసుకున్నా ఫరవాలేదు అనకండి. చెప్పులు మీ శరీరాకృతిని చక్కగా కనిపించేలా చేస్తాయి. చీరల మీదకు వెడ్జెస్‌, స్టిలెట్టోస్‌, పీప్‌టో వంటి రకాలతో పాటు లెదర్‌ ఫ్లిఫ్‌ప్లాఫ్‌లూ చక్కని ఎంపిక. కాస్త ఎత్తు తక్కువ ఉన్నప్పుడు వెడ్జ్‌ రకాలు బాగుంటాయి. సన్నగా ఉన్నా స్టైలిష్‌గా కనిపించాలనుకున్నప్పుడు స్టిలెట్టోస్‌, పీప్‌టో హీల్స్‌ మెప్పిస్తాయి. ఏ సందర్భం అయినా కూడా సౌకర్యంగా ఉంటాయి ఫ్లిఫ్‌ఫ్లాప్స్‌..
మేకప్‌
ఆఫీసుకు వేసుకునే అలంకరణ సహజంగా కనిపించాలి. ఎరుపు రంగు లిప్‌స్టిక్‌, హైలైటర్‌ అప్పుడు అంతగా నప్పవు. కళ్లకు కాజల్‌... పెదాలకు లేత రంగు లిప్‌గ్లాస్‌ రాసుకున్నా చాలు. 
కేశాలంక‌ర‌ణ‌
చీరకట్టుకున్నప్పుడు హెయిర్‌స్టైల్‌ కాస్త క్లాసీగానే ఉండాలి. జుట్టుని వదిలేసినా బాగుంటుంది. అల్లాలనుకున్నప్పుడు రెండు పాయలు అల్లి జుట్టు వదిలేయడం మేలు. పోనీ కూడా చీరల మీదకు బాగుంటుంది.
యాక్సెసరీలు: 
చీరకి తగిన యాక్సెసరీలు ఎంచుకుంటేనే కదా నిండుదనం. అలాగని అతిగా ఉండకూడదు. మెడలో గొలుసు ఉన్నా లేకున్నా చెవులకు పెద్ద స్టడ్స్‌, హ్యాంగింగ్స్‌, చేతికి స్టేట్‌మెంట్‌ బ్యాంగిల్‌, నల్లపూసలు వంటివి మరింత హుందాతనాన్ని తెచ్చిపెడతాయి. జిగేల్‌మనే నగల జోలికి అసలు పోకూడదు. ఆక్సిడైజ్డ్‌ సిల్వర్‌ జ్యూయలరీ ఆఫీసు చీరల మీదకు మెప్పిస్తాయి. సందర్భాన్ని బట్టి టెర్రకోట రకాల్నీ ఎంచుకోవచ్చు. 
బ్లవుజే ప్రధానం: 
చీరలకు జతగా ఎంచుకునే బ్లవుజుతోనే మన ఆహార్యానికి నిండుదనం వస్తుంది. సౌకర్యంతోపాటు స్టైల్‌గానూ కనిపించాలి. చీరతో పాటు వచ్చిన బ్లవుజు కాకుండా కాస్త భిన్నమైన రంగు, డిజైనులో ఎంచుకుంటే ఆ అందమే వేరు. ఆఫీస్‌కి కట్టుకెళ్లే చీరల మీదకు చతురస్రం, బోట్‌, కాలర్‌ నెక్‌, పొడవు చేతులు ప్రయత్నిస్తే ప్రొఫెషనల్‌గా కనిపిస్తారు. కాస్త ఫ్యాషన్‌గా కనిపించాలనుకునేవారు స్లీవ్‌లెస్‌ కూడా ఎంచుకోవచ్చు. డీప్‌నెక్‌లు అంతగా బాగోవు. 
చీరలు: 
ఆఫీసుకి కట్టుకునే చీరలు ఆడంబరంగా కంటే ఆహ్లాదంగా అనిపించాలి. అలాంటివే చేనేత, ఖాదీ రకాలు. వీటిల్లో కలంకారీ, ఇకత్‌, నూలు, కాటన్‌ సిల్క్‌, టస్సర్‌, లినెన్‌ వంటివెన్నో ఉన్నాయి. వాటిని ఎంచుకోవచ్చు. కొట్టొచ్చినట్లు కనిపించే రంగులు కాకుండా... లేత, మధ్యస్థ వర్ణాల్ని ఎంచుకోవడం మంచిది. కళ్లకు జిగేల్‌మనిపించే ప్యాటర్న్‌లు, ఎంబ్రాయిడరీలు అసలే వద్దు. లేదు కాస్తయినా కనిపించాలనుకుంటే సెల్ఫ్‌త్రెడ్‌ హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ ఉండేలా చూసుకోవాలి.