నాన్న మరణం తర్వాతే...


ముంబయి: నాన్న మరణించిన తర్వాతే తాను క్రికెట్‌పై మరింత శ్రద్ధ పెట్టానని భారత క్రికెట్‌ స్టార్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. ‘‘నా కళ్ల ముందే అంతా జరిగిపోయింది. తెల్లవారుజాము 3 గంటల సమయం అనుకుంటా. రంజీ ట్రోఫీ మ్యాచ్‌ ఆడుతూ అంతకుముందు రోజు 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచాను. నిద్ర సరిగా పట్టలేదు. ఉదయాన్నే లేచి మళ్లీ మ్యాచ్‌ కోసం సిద్ధం అయ్యే పనిలో ఉన్నా. ఆ సమయంలోనే నాన్నకు గుండెపోటు వచ్చింది. ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి మా పక్కింటి వాళ్ల సాయం తీసుకోవడానికి ప్రయత్నించాం. కానీ ఆ సమయంలో ఎవరూ సరిగా స్పందించలేదు. అంబులెన్స్‌ వచ్చేసరికే అంతా అయిపోయింది. నాన్న మరణం తర్వాతే ఆటపై మరింత దృష్టి పెట్టా. మా నాన్న కలను, నా కలను నెరవేర్చుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డా. నేనీ స్థితిలో ఇలా ఉన్నానంటే ఆనాటి ఆ సంఘటనే కారణం’’ అని ఒక టీవీ కార్యక్రమంలో కోహ్లి చెప్పాడు. అప్పుడు కోహ్లి వయస్సు పద్దెనిమిదేళ్లు. ఆ రోజు మ్యాచ్‌కు కోహ్లి రాడనే అతడి జట్టు సహచరులు భావించారట. ఐతే కర్ణాటకతో మ్యాచ్‌ ఆడిన కోహ్లి 90 పరుగులు చేయడంతో పాటు.. దిల్లీని ఫాలోఆన్‌ గండం నుంచి తప్పించాడు.

Post a Comment

0 Comments