మన్యంలో మావోల పంజా


అరకు ఎమ్మెల్యే కిడారి దారుణ హత్య
మాజీ ఎమ్మెల్యే సోమనూ చంపేశారు
చర్చిద్దామన్నా చలించలేదు
ఆరు రౌండ్లు పేల్చి ఘాతుకం
విశాఖ జిల్లా లివిటిపుట్టు వద్ద కిరాతకం
కాపుకాసిన 60 మంది మావోయిస్టులు
వారిలో 30 మంది మహిళలే
నేతల క్వారీల తవ్వకంపై ఆగ్రహం
ఎమ్మెల్యే మృతితో అభిమానుల ఆందోళన
రెండు పోలీసు ఠాణాలకు నిప్పు
అరవై మంది సాయుధ మావోయిస్టులు... సగంమంది పాతికేళ్ల లోపువారే... వీరందరికీ ఓ మహిళ నాయకత్వం... చేత చిక్కిన ఇద్దరు ప్రజాప్రతినిధుల్ని ఆమె ‘మీ ఖేల్‌ ఖతం’ అనగానే సాయుధులు కాల్చేశారు.. రక్తపు మడుగులో అచేతనంగా ఉన్న వారిపై కసిగా మరో రెండు రౌండ్లు పేల్చారు..  ప్రశాంత విశాఖ మన్యంలో దాడి చేసి... ఏపీలో కలకలం సృష్టించారు.
ఈనాడు డిజిటల్‌- విశాఖపట్నం, డుంబ్రిగుడ, అరకులోయ-న్యూస్‌టుడే
విశాఖ మన్యం వణికింది. మావోయిస్టుల తూటాలకు అరకు ప్రాంతం దద్దరిల్లింది. కొంతకాలం స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు ఆదివారం ఉరుములేని పిడుగులా విరుచుకుపడ్డారు. ఒక్కసారిగా ఇద్దరు ప్రజాప్రతినిధులపై పంజా విసిరారు. తెదేపాకు చెందిన అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను కాల్చి చంపారు. ఆరు రౌండ్లు కాల్పులు జరపడంతో నేతలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మావోయిస్టుల దాడిపై ఆగ్రహించిన ఎమ్మెల్యే అనుచరులు, స్థానికులు ఆందోళనలకు దిగారు. పోలీసుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని ఆరోపిస్తూ అరకు, డుంబ్రిగుడ ఠాణాలపై దాడులు చేశారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి స్టేషన్లకు, వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో మన్యంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దాడి ఘటనపై అటు ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అరకులోయలోని తన అతిథి గృహం నుంచి ఆదివారం ఉదయం 11.30 గంటలకు గ్రామదర్శినిలో పాల్గొనడం సరాయి గ్రామానికి కోసం బయలుదేరారు. విశాఖ జిల్లా డుంబ్రిగుడ మండలం కండ్రుం పంచాయతీలో ఈ గ్రామం ఉంది. ఎమ్మెల్యే వెంటే మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మరో వాహనంలో వస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో డుంబ్రిగుడ మండల కేంద్రాన్ని దాటి లివిటిపుట్టు చేరుకున్నారు. ఇంతలో పొదలు చాటున దాక్కున మావోయిస్టులు ఒక్కసారిగా ఆయుధాలతో రహదారిపైకి వచ్చి నాయకుల వాహనాలను అడ్డగించారు. వాహనాలను చుట్టుముట్టి ముగ్గురు గన్‌మన్‌ల నుంచి ఆయుధాలు లాక్కున్నారు. నేతలిద్దరితో పాటు వచ్చిన అరకులోయ జడ్పీటీసీ సభ్యురాలి భర్త రమేష్‌, తాజా మాజీ సర్పంచి వెంకటరావు, వ్యక్తిగత సహాయకులు, గన్‌మన్‌లను ఓ చెట్టు కిందకు తీసుకెళ్లి కొందరు మావోయిస్టులు వారితో మాట్లాడారు. డుంబ్రిగుడ నుంచి అటుగా వెళ్లే వాహనాలను నిలిపేశారు. రహదారికి అడ్డంగా రాళ్లు పెట్టారు. జనాలను ఒక చెట్టుకింద సమావేశ పరిచారు. సుమారు 60 మంది వరకు మావోయిస్టులు ఈ ఘటనలో పాల్గొన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వారిలో 30 మంది వరకు మహిళలే ఉన్నారు. ఎక్కువ మంది 25 ఏళ్లలోపు వారే. వీరంతా ఆదివాసీ తెగకు చెందిన భాషలోనే మాట్లాడుతున్నారు.
మీ ఖేల్‌ ఖతం.. 
ముందుగా ప్రభుత్వ విప్‌ కిడారి సర్వేశ్వరరావు వాహనం నుంచి కిందకు దిగిన వెంటనే చేతులను వెనక్కి కట్టేశారు. వెనుక వాహనంలో ఉన్న సివేరి సోమను కిందకు దించి, ‘ఇటీవల ఒడిశాలోని గొల్లూరి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌కు సంబంధించి నువ్వే పోలీసులకు సమాచారం ఇచ్చావంటా’ అంటూ గద్దించారు. మావోయిస్టుల బృందానికి నాయకురాలిగా భావిస్తున్న ఓ 38ఏళ్ల మహిళ గట్టిగా తెలంగాణ యాసలో మాట్లాడింది. ఎమ్మెల్యే కిడారి హుకుంపేట మండలంలోని గూడ క్వారీ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా ధన దాహంతో వెంపర్లాడుతున్నాడని ఆమె మండిపడింది. పార్టీలు మారి అధికారంలోకి వచ్చాక బాక్సైట్‌ని తవ్విస్తూ గిరిజన ద్రోహులుగా మారారని నిందించింది. మాజీ ఎమ్మెల్యే సోమ ఒడిశా సరిహద్దుల్లోని గొల్లోరి వద్ద గతేడాది మావోయిస్టుల శిబిరంపై పోలీసులు జరిపిన కాల్పులకు కారణమని, కాల్పుల్లో తాము త్రుటిలో తప్పించుకున్నామని, తమని చంపించేందుకు పోలీసులతో చేతులు కలిపిన సోమ ద్రోహి అని ఆవేశపూరితంగా  చెప్పింది. సుమారు 15 నిమిషాలు ఆమె మాట్లాడింది. ఆయుధాలతో చుట్టుముట్టేసి కాల్చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో ‘ఆయుధాలతో వద్దు.. మాట్లాడుకుని పరిష్కరించుకుందామ’ని ఆ మహిళా మావోయిస్టును ఎమ్మెల్యే కిడారి బతిమలాడారు. ఎమ్మెల్యే మావోయిస్టులతో మాట్లాడుతుండగానే ‘మీ ఖేల్‌ఖతం’ అని మహిళా మావోయిస్టు అరిచింది. వెంటనే మాజీ ఎమ్మెల్యే సివేరి సోమా దగ్గర ఉన్న మావోయిస్టులు ఆయనపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆయన అక్కడికక్కడే చనిపోయారు. ఎమ్మెల్యే కిడారి కాల్పులు వద్దని వేడుకుంటుండగానే ఆయనపైనా రెండు రౌండ్లు కాల్పుల జరిపారు. ఇద్దరు నేతలూ రక్తమడుగులో నేలకొరిగిన తరువాత ఓ యువతి వారి దగ్గరకు వచ్చి... మరో రెండు రౌండ్లు కిడారిపై కాల్పులు జరిపింది. ‘చనిపోయాడు కదా, ఇంకెందుకు బుల్లెట్లు వృథా చేస్తావ’ంటూ ప్రధాన మహిళా మావోయిస్టు ఆ యువతిని వారించినట్లు తెలిసింది.
పక్కా ప్రణాళికతోనే ... 
ఎమ్మెల్యే కిడారిపై గత కొంత కాలంగా మావోయిస్టులు నిఘా పెట్టారు. క్వారీలు, గిరిజనుల భూముల వ్యవహారాల్లో స్థానికులకు అన్యాయం చేస్తున్నారని ఇదివరకే హెచ్చరికలు జారీచేశారు. వీటిపై ప్రజాప్రతినిధులు అప్రమత్తంగానే ఉన్నా ఇటీవల పార్టీ వ్యవహారాల్లో జోరు పెంచారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో గ్రామాలన్నీ చుట్టిరావాలని భావించారు. ఈ సమాచారం తెలుసుకున్న మావోయిస్టులు పక్కా ప్రణాళికతో దాడికి దిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కూడా ఉదాసీనంగా వ్యవహరించడం వారికి కలిసొచ్చింది. అందుకే మారుమూల గ్రామాల్లో కాకుండా మండల కేంద్రానికి కూతవేటు దూరంలో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే హత్యకు దిగారు. ఒడిశా సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఈ కాల్పులు జరిపారు.
క్వారీలే కారణమా..
ఎమ్మెల్యే కిడారితో పాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమకు కూడా మన్యంలో నల్లరాయి, కాల్సైట్‌ క్వారీలున్నాయి. వీటిలో నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్‌ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా హుకుంపేట మండలంలోని గూడలో కిడారికి చెందిన నల్లరాయి క్వారీయింగ్‌పై స్థానికులు గత 85 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. గూడ క్వారీలో యంత్రాలతో డ్రిల్లింగ్‌ చేయడం ద్వారా పర్యావరణానికి హాని కలగడంతో పాటు పరిసర గ్రామాలు కాలుష్య భరితంగా మారిపోయాయంటూ ఐటీడీఏ ఎదురుగానే 70 రోజులు దీక్షలు చేపట్టారు. క్వారీ వద్ద 15 రోజులు ఆందోళన నిర్వహించారు. వీరికి తెదేపా మినహా మిగతా అన్ని పార్టీల నాయకులు మద్దతిచ్చారు. మావోయిస్టులు కూడా ఈ విషయమై గతంలోనే హెచ్చరికలు జారీచేసినట్లు తెలిసింది. దీంతో తాత్కాలికంగా ఈ క్వారీని అధికారులు మూయించారు. అయితే శాశ్వతంగా క్వారీ మూతపడేలా ఆదేశాలివ్వాలని నిన్నటి వరకు ఆ గ్రామస్థులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఆదివారం  కిడారి, సివేరి సోమతోనూ ఈ విషయమై మావోయిస్టులు వాదించారు. క్వారీ మూసేయాలని చెప్పినా ఎదురించి ఎందుకు నిర్వహిస్తున్నారనినిలదీశారు. ఆ క్వారీ మూసేశామని, ఆయుధాలు వాడ వద్దని, శాంతియుతంగా మాట్లాడుకుందామని అంటుండగానే తుపాకీలు ఎక్కుపెట్టి కాల్పులు జరపడంతో నేతలిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.
గిరిజన ద్రోహులైనందునే చంపుతున్నామన్న మావోయిస్టులు
ప్రత్యక్ష సాక్షుల కథనం
‘‘పార్టీలు మారి అధికారంలోకి వచ్చారు. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని బాక్సైట్‌ను తరలించేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.కోట్లు దండుకుంటున్నారు. గొల్లోరిలో మమ్మల్ని ఎన్‌కౌంటర్‌ చేయించేందుకు ప్రయత్నించారు. గూడ క్వారీ విషయంలో గిరిజనులను సమిధలను చేశారు. ఇన్నాళ్ల నుంచి క్వారీకి వ్యతిరేకంగా గ్రామస్థులు..గిరిజనులు నిరసన దీక్షలు చేస్తున్నా పట్టించుకోకపోవటం మీ ధన దాహానికి నిదర్శనం. ప్రజలు ఆందోళనలను అధికారాన్ని అడ్డం పెట్టుకుని అణిచివేస్తున్నారు. ప్రభుత్వంతో కుమ్మక్కై గిరిజనుల సంపదను దోచుకుంటున్నారు. మీరు గిరిజన ద్రోహులు’’ ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమలను చుట్టుముట్టిన అనంతరం మావోయిస్టులు అన్నమాటలివి.
స్వామి, మాజీ ఎమ్మెల్యే సోమ గన్‌మెన్‌
అప్పారావు, ఎమ్మెల్యే కిడారి వ్యక్తిగత సహాయకుడు
ఈ రోజు మావోయిస్టుల చేతిలో చచ్చాం
రా కిడారి చివరి మాట అదే
‘పన్నెండేళ్లుగా కిడారి సర్వేశ్వరరావు కారు డ్రైవర్‌గా పని చేస్తున్నా. ఈ రోజు ఇలా జరుగుతుందని ఊహించనే లేదు. వాహనం ఒక్కసారిగా మావోయిస్టుల వలయంలో చిక్కుకుంది. ఎవరం ఏమీ చేయలేని పరిస్థితి. మా ముందు పావు కి.మీ. దూరం వరకు ఆయుధాలతో మావోయిస్టులు ఉన్నారు. ముందు కొందరు, వెనుక కొందరు ఉండి మధ్యలో మేం చిక్కుకుపోయేలా వల పన్నారు. నెమ్మదిగా వెళ్తున్న మా వాహనం ఎదురుగా ఒక్క ఉదుటున మావోయిస్టులు రావడంతో బ్రేకులు వేయాల్సి వచ్చింది. గమనించిన ఎమ్మెల్యే ‘అరే.. ఈ రోజు మావోయిస్టుల చేతిలో చచ్చాం రా’ అన్నారు. మావోయిస్టులు దగ్గరకు రాక ముందే ఆయనే వాహనం దిగారు. అనంతరం మావోయిస్టులు నన్ను బాక్సైట్‌ తవ్వకాల గురించి అడిగారు. వైకాపా నుంచి తెదేపాలోకి మారినందుకు ఎంత తీసుకున్నారో తెలుసా? అని అడిగారు తెలియదని చెప్పా’.
- రవి, ఎమ్మెల్యే కారు డ్రైవరు

Post a Comment

0 Comments