మధ్యాహ్నం 12:15కు ప్రారంభించనున్న గవర్నర్‌
  సాయంత్రం 6 గంటల తర్వాత ప్రయాణికులకు అనుమతి
ఈనాడు, హైదరాబాద్‌: మెట్రోరైలు కారిడార్‌-1 (మియాపూర్‌-ఎల్‌బీనగర్‌) సోమవారం నుంచి పూర్తిస్థాయిలో  అందుబాటులోకి రానుంది. అమీర్‌పేట నుంచి ఎల్‌బీనగర్‌ వరకు 16 కి.మీ. మార్గాన్ని గవర్నర్‌ నరసింహన్‌ సోమవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభించనున్నారు. పెద్దగా హడావుడి లేకుండా జరిగే ఈ  ప్రారంభోత్సవంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు స్థానిక మంత్రులూ పాల్గొంటారు. గవర్నర్‌తో కలిసి వీరంతా మెట్రోలో అమీర్‌పేట నుంచి ఎల్‌బీనగర్‌ వరకు ప్రయాణిస్తారు. సాయంత్రం 6 గంటల తర్వాత ప్రయాణికులను ఈ మార్గంలో అనుమతించనున్నట్లు హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి ‘ఈనాడు’కు తెలిపారు. మెట్రోరైలు కారిడార్‌-1లోని కొంత దూరం మియాపూర్‌ నుంచి అమీర్‌పేట, కారిడార్‌-2లోని నాగోల్‌ నుంచి అమీర్‌పేట వరకు 30 కి.మీ. మార్గాన్ని ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ గత ఏడాది నవంబరు 28న ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు నుంచి ప్రయాణికులకు మెట్రోలో అనుమతించారు. ఈ సారి మాత్రం ప్రారంభోత్సవం రోజు సాయంత్రం నుంచే అనుమతించనున్నారు. సోమవారం ప్రారంభించే మెట్రో మార్గంతో కలిపి హైదరాబాద్‌లో 46 కి.మీ. మెట్రో అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. దీంతో దేశంలోనే అత్యంత పొడవైన మెట్రోరైలు మార్గాల్లో ఇది రెండోది అవుతుంది.